ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వివిధ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బౌద్ధనగర్ డివిజన్లోని వార్డు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మారావుగౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు వివాహాలు భారం కాకుండా ఏర్పాట్లు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు.
పేదల సంక్షేమానికి పాటుపడుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అత్యధికులకు సీఎంఆర్ఎఫ్ అందజేశామని వివరించారు. దళారీల ప్రమేయం లేకుండా, డబ్బులు పొందేందుకు ఎవరికీ లంచాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజలకు నిరంతరం తాము అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంది శైలజ, సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, రాసురి సునీత, తహశీల్దార్లు చందన, రాజునాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.