మన్సూరాబాద్ : కాలనీలలోని ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపుల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న మహాప్రస్థానంకు వెళ్లే మార్గంలోని హిందూ అరణ్య నుంచి రోడ్డుకు ఇరువైపుల ఇటీవల నాటిన మొక్కలను సోమవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కల వలన ప్రజలకు ఆక్సిజన్ లభించడమే కాకుండా అందమైన పూలతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒకవైపు కోట్లాది రూపాయలతో అభివృద్ధిపనులు చేపడుతూనే మరోవైపు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మొక్కలను నాటుతున్నామని తెలిపారు.
ప్రజలు సైతం సాంఘిక బాధ్యతతో ముందుకు వచ్చి తమ ఇంటి పరిసరాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నుంచి తెప్పించి నాటిన మొక్కలతో భవిష్యత్తులో ఎల్బీనగర్ నియోజకవర్గం పూలవనంలా మారుతుందని ఆయన పేర్కొన్నారు.