పచ్చని వాతావరణంతో ఓయూ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయి. సమగ్ర నివేదిక (డీపీఆర్)తో వస్తే ఆక్సిజన్ పార్కు సహా ఓయూలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తా.
– ఎంపీ సంతోష్‌కుమార్
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 16: ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటైన ఆక్సిజన్ పార్క్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ సహకారంతో ఓయూలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. పార్కును ప్రారంభించిన అనంతరం ఓయూ అధికారులతో కలిసి ఆయన లోపల కలియతిరిగారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ పచ్చని వాతావరణంతో ఓయూ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని చెప్పారు. మోమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర నివేదిక (డీపీఆర్)తో వస్తే ఆక్సిజన్ పార్కు సహా ఓయూలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. 200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో పార్కును అభివృద్ధి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఓయూ అధికారులు మాట్లాడుతూ.. వృక్షమిత్ర, ఎంపీ సంతోష్‌కుమార్ ఈ పార్కును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జీవజాతుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పాదచారులను కొంత వరకు కట్టడి చేశామని, ఉదయం, సాయంత్రం మాత్రమే కొంత మేరకు అనుమతిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, వివిధ ఫ్యాకల్టీల డీన్లు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.