సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): ఒక ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు.. ఉప్పల్ భగాయత్ లేఅవుట్.. కోకాపేట నియోపోలిస్, బాలానగర్ ఫ్లై ఓవర్, గండిపేట పార్కు, హుస్సేన్‌సాగర్ తీరంలో లేక్‌ఫ్రంట్ పార్కు.. ఇవీ హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టుల్లో మచ్చుకు కొన్ని మాత్రమే. హైదరాబాద్ మహానగర వాసులకు హెచ్ఎండీఏ అంటే ఒక నమ్మకం. ఇవన్నీ గత పదేండ్ల కాలం వరకే అన్నట్లుగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. గతేడాది ఎన్నికల కోడ్ మూలంగా నవంబర్, డిసెంబర్ నుంచే అభివృద్ధి పనులు నిలిచిపోగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టింది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, పనుల్లో మాత్రం చలనం లేదు. నగర శివారు ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల పనుల కల్పన, రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా హెచ్ఎండీఏ లేఅవుట్లలో ప్లాట్లను ఆన్లైన్లో వేలం ద్వారా విక్రయించి సొమ్ము చేసుకున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదంటూ కొనుగోలు దారులు మండిపడుతున్నారు. లేఅవుట్లు మాత్రమే కాదు.. నిజాంపేట, బాచుపల్లి ప్రాంతంలో చేపట్టిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సైతం నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోర్టును ఆశ్రయించిన ప్లాట్ల కొనుగోలు దారులు..
నగర శివారులోని తొర్రూర్‌లో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో రెండు దశల్లో ప్లాట్లను విక్రయించారు. మొదటిసారి 2022 జూలైలో ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించారు. అప్పటి నుంచి 18 నెలల్లో లేఅవుట్లో పూర్తి స్థాయిలో మౌలికవసతులు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, పార్కుల నిర్మాణం పూర్తి చేసి, అభివృద్ధి చేసిన లేఅవుట్‌ను కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంటుంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలు పెట్టినా, ఆ తర్వాత 5 నెలల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడే అగిపోయాయి. తమకు చెల్లించాల్సిన బిల్లులు కోట్లలో ఉన్నాయని, వాటిని చెల్లించకపోతే పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఏడాది గడిచినా తొర్రూర్ లేఅవుట్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని ప్లాట్ల యజమానులు ఆగ్రహంతో ఉన్నారు. హెచ్ఎండీఏ తీరుపై కొనుగోలు చేసిన యజమానులు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు దాకా వెళ్లడంతో ఆ కాంట్రాక్టరుతో చర్చించి మళ్లీ పనులు మొదలు పెట్టినా, అది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలా ఒక్క తొర్రూరు లేఅవుట్లోనే కాదు… ఇతర లేఅవుట్లైన బహదూర్‌పల్లి, బాచుపల్లిలోని లేఅవుట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగిస్తే గృహ నిర్మాణాలు చేసుకుంటామని కొనుగోలు దారులు హెచ్ఎండీఏ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది.
మసకబారుతున్న హెచ్ఎండీఏ..
ప్రభుత్వం ఏర్పాటు చేసే లేఅవుట్ అంటే ప్రజలకు నమ్మకం. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేసి అప్పగిస్తారన్న మంచి పేరు హెచ్ఎండీఏకి ఉంది. కానీ హెచ్ఎండీఏలో గత ఏడాదిన్నర కాలంలో పలు చోట్ల చేపట్టిన లేఅవుట్లు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం మారడంతో అందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అయోమయానికి గురవుతున్నారు. హెచ్ఎండీఏ వెంచర్లో ప్లాట్లు అని లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. వేలం వేసిన తర్వాత 18 నెలల్లో లేఅవుట్లలో చేపట్టాల్సిన మౌలిక వసతులు కల్పించ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బుద్వేల్, మోకిల లేఅవుట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ వాటిని ఒకే కంపెనీకి సుమారు రూ. 400 కోట్లకు అప్పగించింది. ఇతర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేయకుండా ఎక్కడికక్కడే వదిలేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా ఆందోళన చెందుతున్నారు.