OU Exams | సికింద్రాబాద్, ఫిబ్రవరి7: ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఓయూ పరిపాలనా భవన్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. ఓయూ సైన్స్, నిజాం కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజి, సికింద్రాబాద్ కాలేజి సైన్స్ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి అయినప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ నెల 18వ తేదీ నుంచి మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. అయితే ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడంతో పాటు అదే సమయంలో పలు పరీక్షలు ఉండటంతో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చే స్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం విద్యార్థులు ఓయూ పరిపాలన భవన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అధికారులు పరీక్ష వాయిదా వేస్తామని చెప్పకపోవడంతో విద్యార్థులు అర్ధరాత్రి అయినా అలాగే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం పరీక్షలను వాయిదా వేసే అవకాశాలే లేవని స్పష్టం చేస్తున్నారు.