సిటీబ్యూరో, మే 2(నమస్తే తెలంగాణ) : నాణ్యమైన విద్యా విధానం కోసం ఉస్మానియా యూనివర్సిటీ పలు చర్యలు కొనసాగిస్తున్నది. ముఖ్యంగా ఓయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజినీరింగ్, లా కాలేజీల్లో నాణ్యమైన విద్యను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది. అందుకోసం 2023-24 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ విధానంలో కూడా సమూల మార్పుతో ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది. ఒక పక్క అఫిలియేషన్ల కోసం ఆన్లైన్ విధానాన్ని అమలు పరుస్తూనే మరో పక్క.. ప్రైవేటు కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నది. దీంతో కాలేజీల వాస్తవ పరిస్థితులను ఓయూ అకడమిక్ విభాగం ఎప్పటికప్పడు తెలుసుకంటూ.. నివేదిక తయారు చేస్తున్నది.
ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో కొన్ని కాలేజీలు తెరుచుకోవడం లేదని, మరికొన్ని కాలేజీలు తెరుచుకున్నప్పటికీ వాటిలో విద్యార్థులు, బోధన సిబ్బంది కన్పించడం లేదంటున్నారు. మరికొన్ని కాలేజీలు ఊహించిన దాని కంటే చాలా బాగా నడుపుతున్నారని చెబుతున్నారు. ఈ విధంగా అఫిలియేషన్ ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుంది. అయితే ఈసారి మ్యాన్యువల్‌గా కాకుండా పూర్తిగా ఆన్లైన్ విధానంలో అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఓయూ కాలేజీ పరిధిలో కొనసాగే ప్రైవేటు కాలేజీలన్ని అమలును అందుబాటులోకి తెచ్చిన యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టం (యూఎంఎస్) పరిధిలోకి ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్ విధానం తీసుకువచ్చింది. దీని ద్వారానే కాలేజీల అఫిలియేషన్ల కోసం కావాల్సిన దరఖాస్తులు, డాక్యుమెంట్లు అన్ని అప్లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే జూలై నెలాఖరు నాటికి అన్ని రకాల కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కసరత్తు చేసున్నామని ఓయూ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న ఆన్లైన్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్..
యూఎంఎస్ విధానం ద్వారా అఫిలియేషన్ కోసం స్వీకరిస్తున్న దరఖాస్తులు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లను క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. దీంతో కాలేజీ రెన్యువల్స్ కోసం జత చేసే లీజు అగ్రిమెంట్లు, అవసరమైన భూపత్రాలన్ని సక్రమంగా ఉన్నాయా? లేదా అనే దానిని కాలేజీల వారీగా తనిఖీ చేస్తున్నారు. అయితే కొన్ని కాలేజీలు నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేస్తున్న విషయం తమ దృష్టికి వస్తున్నాయని, అలాంటి కాలేజీలపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి యూనివర్సిటీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ఓయూ అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీగణేశ్ చెప్పారు. అయితే ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలిపారు. ఈసారి గడువు తేదీ దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా పొడిగించేదిలేదని డైరెక్టర్ స్పష్టం చేశారు.
ఓయూ పరిధిలో ఉన్న 450 పైగా డిగ్రీ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం వరకు అఫిలియేషన్ గడువు ఉన్నప్పటికీ.. ఓయూ వెబ్సైట్లోకి అఫిలియేషన్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈక్రమంలోనే డిగ్రీ కాలేజీలకు ఏడాదికి కొన్ని చొప్పున విడుతల (ఏడాదిలో కనీసం 150వరకు) వారీగా వరుసగా మూడేండ్లు అఫిలియేషన్లు ఇస్తామన్నారు. అయితే డిగ్రీ కాలేజీలకు ప్రతి మూడేండ్లకు ఒకసారి అఫిలియేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. అలాగే పీజీ కోర్సులు రెండేండ్లకు ఒక సారి దరఖాస్తు చేసుకుంటే ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా కాలేజీలు మాత్రం అఫిలియేషన్లకు ప్రతి ఏడాది దరఖాస్తులు చేసుకోవాలి అన్న నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని డైరెక్టర్ తెలిపారు.