ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ ను శనివారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.750.81 కోట్లుగా చూపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.21.73 కోట్ల ఓపెనింగ్ బ్యాలెన్స్ కలిపి మొత్తం రూ.772.54 కోట్ల నిధులు అందుబాటులో ఉండగా, వ్యయం రూ.815.69 కోట్లుగా చూపెట్టారు. రూ.43.15 కోట్ల లోటుతో బడ్జెట్ ను ఆమోదించారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.542.68 కోట్లు, మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనుంది. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో నిర్వహించిన అకాడమిక్ సెనేట్ సమావేశంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు.
ఈ నివేదికలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర వాటిని వివరించారు. యూనివర్సిటీ నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ల గురించి పేర్కొన్నారు. సాధారణంగా బడ్జెట్ ను సీనియర్ ప్రొఫెసర్లలో ఒకరు ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది ఓయూ టెక్నాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ చింత సాయిలు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా మధ్యలో ప్రొఫెసర్ సాయిలు ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన బ్రెయిన్ స్టోక్ కు గురయ్యారని, చికిత్స ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన బడ్జెట్ ప్రసంగాన్ని మేనేజ్మెంట్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ శ్రీరాములు పూర్తి చేశారు.
సభ్యులు ఏకాభిప్రాయంతో బడ్జెట్ ను ఆమోదించారు. ఓయూకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.542.68 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరుకాగా, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.21.73 కోట్లు, ఇందులో రూ.35.63 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్ఆర్ సీడీఈ, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్, టీఎస్పీజీఈటీ కన్వీనర్ తదితర సంస్థల నుంచి నిధుల మళ్లింపు ద్వారా రూ.168.50 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల వసూల ద్వారా రూ.4.00 కోట్లు సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.453.91 కోట్లు కాగా, పెన్షన్లకు రూ.310.00 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆకస్మిక అవసరాలకు రూ.47.78 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.4.00 కోట్లు కేటాయించారు.
యూనివర్సిటీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సింహ భాగం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే సరిపోతోంది. ఉద్యోగుల వేతనాలకు రూ.458.91 కోట్లు అవసరముండగా, ఇది వర్సిటీ మొత్తం బడ్జెట్లో 55.65 శాతం కావడం గమనార్హం. అదేవిధంగా పెన్షన్లకు మరో రూ. 310.00 కోట్లు కేటాయించగా, ఇది 38.00 శాతంగా ఉంది. మిగిలినదాంట్లో 5.86 శాతం కాంటింజెన్సీకి, 0.49 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. అయితే వేతనాలు, పెన్షన్లకు మొత్తం బడ్జెట్లో 98.65 శాతం పోలింది. 2015-18 ఆర్థిక సంవత్సరంలో ఈ శాతం 65.75గా ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా వర్సిటీ పై మరింత భారం పడింది.