అమీర్‌పేట్, జూలై 15: జీవితంలో ఎదురయ్యే తిరస్కారాలను సవాళ్లుగా స్వీకరించడం అలవర్చుకోవాలని ఆస్కార్ అవార్డు విజేత గుణీత్ మొంగా పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా ఎన్నో తిరస్కారాలను ఎదుర్కొన్నానని, ఈ క్రమంలో ఎక్కడ కూడా మానసిక స్థైర్యం కోల్పోకుండా నిలదొక్కుకోవడంలో తన కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాయని అన్నారు.
ఈ మేరకు మంగళవారం బేగంపేట్‌లోని హోటల్ గ్రాండ్ కాకతీయలో ఫిక్కిలేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘గోల్డెన్ లైన్స్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుణీత్ మొంగా 200 మందికి పైగా యువ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న సదస్సును ఉద్దేశించి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎఫ్ఎల్ ఓ చైర్పర్సన్ పల్లవి జైన్.. ఆస్కార్ విన్నర్ గుణీత్ మొంగాతో సంభాషించారు.
గుణీత్ మొంగా నిర్మించిన ప్రసిద్ధ చిత్రాలు ద లంచ్‌బాక్స్, మసాన్, పగ్గలైత్, ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పరర్స్ కు సంబంధించిన విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. తన భవిష్యత్ లక్ష్యాల గురించి గుణీత్ మొంగా మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం 1500కు పైగా సినిమాలు వస్తున్నా, వాటిలో 10 శాతం కూడా మహిళా దర్శకులు లేరని, ఇది బాధించే విషయం అన్నారు.
అందుకే ఉమెన్ ఇన్ ఫిలిం – ఇండియా చాప్టర్‌ను ప్రారంభించడం జరిగిందని, ఈ చాప్టర్ ప్రధానంగా మహిళలకు మద్దతుగా ఉండటం, సమానత్వాన్ని కోరుతూ విధాన పరమైన మార్పులకు నడుం కట్టే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. హైదరాబాద్‌కు రావడం అంటే తన సొంత నగరంలో ఉన్నట్టుగానే భావిస్తున్నానని, చాలా కాలం తర్వాత ఇక్కడ బిర్యానీని ఆస్వాదిస్తున్నానని, అవకాశం వస్తే టాలీవుడ్ నటులతో కలిసి పని చేయాలని ఉందన్నారు.