విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించనున్నారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ నాయికలుగా నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్నది. ఈ నెల 21న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏపీలోని రాజమండ్రిలో నిర్వహించారు. రామ్చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ…‘రామ్చరణ్ అతిథిగా రావడం సంతోషంగా ఉంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. తప్పకుండా విజయం సాధిస్తుంది. ఈ టీమ్ అందరికీ పేరు తెచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాకా మాట్లాడుతూ…‘ రామ్చరణ్ గారికి థాంక్స్. పీఆర్వోగా చాలా చిత్రాలకు పనిచేశాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడం వల్ల ప్రొడక్షన్లోని ఇబ్బందులు తెలిశాయి. ఒక మంచి సినిమా చేశామన్న సంతృప్తి ఉంది’ అన్నారు. రామ్చరణ్ మాట్లాడుతూ..‘విశ్వక్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతాను. జయాపజయాలు అందరికీ సహజం కానీ మన వ్యక్తిత్వమే ఇండస్ట్రీలో కాపాడుతుంది. నేను రాజమండ్రిలో జరిగిన ‘ఉప్పెన’ సినిమా వేడుకకు హాజరయ్యాను. అది మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా అలాగే పేరు తెచ్చుకోవాలి’ అన్నారు.