Organ Donation | మన్సూరాబాద్, సెప్టెంబర్ 5: బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరి కొందరికి ప్రాణం పోశారు ఆ కుటుంబ సభ్యులు. మీర్‌పేటలోని టీఎస్ఆర్ నగర్‌కు చెందిన కందికట్ట రవి కుమారుడు కందికట్ట తేజ (20) చదువుకుంటున్నాడు. గత నెల 29న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బైకుపై వెళ్తుండగా.. సంతోష్‌నగర్, మిథాని వద్ద గుర్తు తెలియని బైకు ఢీ కొట్టింది.
తీవ్రంగా గాయపడిన తేజను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని దవాఖానలో చేర్పించారు. ఆరు రోజుల పాటు మెరుగైన వైద్యం అందించినప్పటికీ తేజ ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ నెల 4న సాయంత్రం 6.56 గంటలకు తేజకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని తెలుసుకున్న జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులు తేజ కుటుంబసభ్యులను కలుసుకొని అవయవదానంపై అవగాహన కల్పించారు.
బ్రెయిన్ డెడ్ అయిన అతడి అవయవాలను దానం చేసి.. మరి కొందరికి జీవితాలను ప్రసాదించవచ్చని జీవన్‌ధాన్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. మరణించిన తమ కుటుంబసభ్యుడి వల్ల మరి కొందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని తెలుసుకున్న వారు బ్రెయిన్ డెడ్ అయిన తేజ అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. తేజకు చెందిన రెండు కిడ్నీలు, లివర్, గుండెను దానం చేశారు.