Amberpet Flyover | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : జాతీయ రహదారులు రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు సుమారు రూ. 335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం మరింత ఆలస్యం కానుంది. ఫ్లైఓవర్ పనులను ఏళ్ల తరబడి నిర్మాణం జరుపుతూ కేంద్రప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తుండగా.. అందుకు చేయాల్సిన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తూ వస్తున్నది. దీంతో అంబర్‌పేట వాసులకు ప్రధాన మార్గంలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులు 2018లో ప్రారంభమయ్యాయి. 2023 కల్లా పూర్తి కావాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కొరవడడంతో నత్తకు నడకలు నేర్పుతున్నట్టుగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో.. సివిల్ వర్క్స్ తుది దశకు చేరుకున్న సర్వీస్ రోడ్డుకు మాత్రం భూ సేకరణ సమస్య తొలగడం లేదు. ఈ నేపథ్యంలోనే భూసేకరణకు అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.
ఫ్లైఓవర్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంగళవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఆర్ అండ్ బి జాతీయ రహదారి శాఖ ఎస్ఈ, జీహెచ్ఎంసీ అడిషనల్ జోనల్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఫ్లైఓవర్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్‌కు సంబంధించిన సివిల్ పనులు పూర్తయ్యాయని, సర్వీస్ రోడ్డు వేసేందుకు వివిధ ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పనులను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ ఎస్ఈ ధర్మారెడ్డి..కమిషనర్‌కు వివరించారు. గోల్నాక నుండి అంబర్ పేట్ వరకు అక్కడక్కడ అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను కమిషనర్ పరిశీలించారు.
అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం తాము సహకారం అందిస్తామని ముస్లిం కమ్యూనిటీ పెద్దలు ఈ సందర్భంగా కమిషనర్‌కు చెప్పారు. కొన్ని భాగాల నిర్మాణానికి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సంబంధిత పనులను కొనసాగించాలని కమిషనర్ ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, రఘ్రుపసాద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ దివాకర్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ దివాకర్, ఈఈ తదితరులు పాల్గొన్నారు.