Operation Muskan | కాచిగూడ, జూలై 17: బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడమే లక్ష్యంగా ముస్కాన్ ఆపరేషన్ పనిచేస్తుందని కాచిగూడ రైల్వే ఇన్ స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు. బాలలను చేరదీసి వారి భవిష్యత్తు అంధకారం కాకుండా బాధ్యతగా కృషి చేస్తుందని అన్నారు. ముస్కాన్ ఆపరేషన్‌లో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో గురువారం 8 మంది బాలలను చేరదీసి, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్కేశ్కుమార్ (22), పప్పు ఖాన్(25), గులాం హుస్సేన్ (22), అభిమన్యు సహాని(21) ఒక ముఠాగా ఏర్పడి యూపీ నుంచి బాలురను తీసుకొచ్చి హైదరాబాద్‌లో వివిధ పనుల్లో కుదుర్చుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కృష్ణ పవన్(15), ఆకాశ్(15), విక్కీ (11), దీపక్ గౌతమ్(14), సాహిద్(16), లాజర్(14), ఉదయ్ ధాన్(15), అజయ్ (17) బాలురను గోరఖ్‌పూర్-యశ్వంత్‌పూర్ రైలులో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే బాలుర అక్రమ రవాణాను గుర్తించిన ముస్కాన్ ఆపరేషన్ ప్రతినిధులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత బాలురను సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఆశ్రిత ఓపెన్ షెల్టర్ స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. బాల కార్మికులతో పనిచేయించడానికి యూపీ నుంచి తీసుకొచ్చిన నలుగుర్ని కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేశారు.