తెలుగు యూనివర్సిటీ, జనవరి 10 : గురువు అనుగ్రహంతో శాస్ర్తుల రఘుపతి ఉన్నత స్థితికి చేరుకున్నారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శాస్ర్తుల రఘుపతి కావ్యత్రయ ఆవిష్కరణ సభ సోమవారం జరిగింది. డాక్టర్ శాస్ర్తుల రఘుపతి రచించిన పీహెచ్డీ కావ్యం కవిత్రయ మహాభారతంలో సూక్తులు, గ్రంథాన్ని రమణాచారి, శతక యుగళమ భారతీ శివ శతకాలను తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్‌రావు, జీవన వాణి పద్య కావ్యాన్ని ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య పి.సుమతీ నరేంద్ర ఆవిష్కరించారు. తెలుగు పద్యాలను, మహాభారతంలోని సూక్తులను పత్రికల్లో ప్రచురించి నేటి తరానికి పద్యాల్లోని అర్థాన్ని తెలియజేసేలా కృషి జరుగాలని రమణాచారి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అవధాని అష్టకాల నరసింహ రామశర్మ, విశ్రాంత అధ్యాపకులు పరాశరం శారద, ప్రసాద్ దంపతులు, కవి డాక్టర్ వెలుదండ సత్యనారాయణ రావు, వీణాపాణి పత్రికా సంపాదకుడు అష్టకాల విద్యాచరణ్ తదితరులు పాల్గొన్నారు.