Cyber Crime | వెంగళరావునగర్, డిసెంబర్ 17 : ఆన్లైన్ గేమ్స్ యాప్‌లో పెట్టుబడులు పెడితే లాభదాయకమైన వాటాలిస్తామంటూ నమ్మబలికిన మోసగాళ్లు రూ. 3.56 కోట్లకు పైగా దోచుకున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వారాసిగూడకు చెందిన కె.వెంకటరమణ, కూకట్‌పల్లికి చెందిన యు.ఉమాశంకర్, భీమవరానికి చెందిన డి.తరుణ్చంద్ర కలిసి తాము ఆన్లైన్ గేమ్స్, ట్రింప్ సొల్యూషన్స్ కంపెనీని నిర్వహిస్తున్నట్టుగా 2019లో మధురానగర్‌కు చెందిన మెట్టు సుమంత్కుమార్రెడ్డిని కలిసి చెప్పారు. తమ కంపెనీ నిర్వహించే ఆన్లైన్ యాప్స్‌లో లైవ్, స్పోర్ట్స్, ఈవెంట్స్ వేడుకలను నిర్వహిస్తామని నమ్మించారు. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభదాయకమైన వాటాలిస్తామని నమ్మబలికారు.
తమ కంపెనీకి లక్ష మంది క్లయింట్స్ ఉన్నారని, సబ్ స్ర్కైబర్స్ బాగున్నారని, ఫ్రీహిట్ ఫాంటసీ పేరిట మరో కంపెనీని కూడా స్థాపించామని తెలిపారు. వీరి మాటలు నమ్మిన మెట్టు సుమంత్‌కుమార్‌రెడ్డి పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాడు. 2020లో ఎంఓయూ. కుదుర్చుకున్నారు. ఫ్రీ హిట్ ఫాంటసీ కంపెనీలో సుమంత్‌కుమార్‌రెడ్డి రెండు దఫాలుగా రూ.3,56,73,334 పెట్టుబడిగా పెట్టాడు. అతడితోపాటు వెంకట ఫణీంద్ర కూడా సదరు కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు ఇవ్వకపోవడంతో ఆరా తీశారు. తీరా అసలు యాప్స్ అంతా బోగస్ అని.. ఎలాంటి యాప్స్‌ను నిర్వహించడం లేదని తెలుసుకొని ఖంగుతిన్నారు. తమ నుంచి తీసుకున్న కోట్లాది రూపాయలు తిరిగి ఇచ్చేయాలని కోరినా ఇవ్వకపోవడంతో చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితుడు సుమంత్‌కుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.