Ecommerce | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల చెంగిచర్లకు చెందిన ఒక సంస్థ నిర్వాహకుడు 200 ఖాళీ అక్సిజన్ సిలిండర్ల కోసం అన్ని వెబ్సైట్లలో ఆన్లైన్లో కొనేందుకు పరిశోధించాడు. ఇండియమార్ట్ వెబ్సైట్లో బల్క్‌లో విక్రయించేవారు ఎక్కువగా ఉంటారని అందులో వెతికాడు. అందులో పలువురు ఖాళీ సిలిండర్లు సరఫరా చేసే వాళ్లను పరిశీలించి చివరకు క్వాంటిక్ సొల్యూషన్ల్ నిర్వాహకుడి కంపెనీ బెంగుళూర్లో ఉండడంతో ఆ సంస్థ నిర్వాహకుడు బాల సుబ్రమణ్యన్‌ను సంప్రదించాడు. దీంతో బాధితుడు 200 ఖాళీ సిలిండర్లకు సంబంధించిన కొటేషన్‌ను తీసుకున్నాడు.
దీంతో ఇద్దరి మధ్య సిలిండర్ల పంపిణీకి ఒప్పందం జరిగింది. రూ.10,14,800కు ఇన్వాయిస్ రావడంతో అందులో రూ.9,35,000లను బాధితుడు అడ్వాన్స్‌గా చెల్లించి, సిలిండర్లను పంపించాలని కోరాడు. డబ్బు చెల్లించి 45 రోజులైనా సిలిండర్లు మాత్రం రాలేదు. దీంతో ఆ సంస్థ గూర్చి వాకబు చేశాడు, ఫోన్ నెంబర్లు స్వీచాఫ్ ఉన్నాయి, దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
ఇలా ఈకామర్స్ వెబ్సైట్లలో అర్డర్లు పెట్టినా నేరగాళ్లు ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. సాధారణంగా ఈకామర్స్ వెబ్సైట్లు ఒక ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి అమ్మకందారులను, కొనుగోలుదారులను ఒక చోటకు చేర్చుతుంటాయి. తమ ఫ్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు నిర్వహించే వారు నమ్మకంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా సైట్లపై ఉంటుంది. ఇలాంటి నమ్మకమైన ఈ కామర్స్ వెబ్సైట్లలోను సైబర్‌నేరగాళ్లు చేరి నిండా ముంచేస్తున్నారు. ఇప్పుడు బల్క్‌లో ఎక్కడైనా వస్తువులు కొనాలంటే అన్ని విషయాలు ఆలోచించాల్సిన అవసరముంటుంది. ఇటీవల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఆన్లైన్లో డబ్బులు పంపించేముందు సంబంధిత సంస్థలు తెలిసి ఉంటేనే లావాదేవీలు చేయాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.