సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : దేశంలో నూనె గింజల దిగుమతి భారాన్ని తగ్గించేలా, దిగుబడిని మరింత పెంచేలా ఇక్రిసాట్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ సీడ్స్ అండ్ ప్రొడ్యూస్ ఎక్స్ పోర్టు ప్రమోషన్ కౌన్సిల్‌తో కలిసి దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని పెంచేలా కృషి చేయనుంది. ముఖ్యంగా నూనె గింజల నాణ్యతపైనే ఆయిల్ దిగుబడి పెరిగే అవకాశం ఉండటంతో క్వాలిటీ ఆయిల్ సీడ్ సాగును ప్రోత్సహించేలా ఇరు సంస్థలు కృషి చేయనున్నాయి. దేశంలో ఆహార పంటల ఉత్పత్తులను క్రమంగా పెంచడం, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. ఇప్పటికే స్టేక్ హోల్డర్లు, రైతులకు అవగాహన కల్పిస్తూ ఆధునిక సాగు విధానాలను అమలు చేస్తున్నది. వాతావరణ మార్పులు నూనె గింజల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో ఏటా 15 మిలియన్ టన్నుల ఎడిబుల్ ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అఫ్లోటాక్సిన్ రహిత పల్లీ గింజల సాగును మరింత ప్రోత్సహించి ఎగుమతి లక్ష్యాన్ని చేరుకునేలా ఇక్రిసాట్ సంబంధిత రైతులు, స్టేక్ హోల్డర్ అయినా ఇండియన్ ఆయిల్ సీడ్స్ అండ్ ప్రొడ్యూస్ ఎక్స్ పోర్టు ప్రమోషన్ కౌన్సిల్‌తో కలిసి పనిచేయనుంది.
సాగుపైనే ప్రపంచ దేశాల దృష్టి
వ్యవసాయ యూనివర్సిటీ మార్చి 13 : వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషి జరుగుతుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్ఐఆర్ డీపీఆర్) డైరెక్టర్ ఆఫ్ జనరల్ నాగేంద్ర కుమార్ తెలిపారు. సోమవారం ఇక్రిసాట్ కార్యాలయంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆసియాతో పాటు ఆఫ్రికా ఖండాల అభివృద్ధికి తోడ్పాటునందించే అవకాశాలు మెరుగు పడ్డాయన్నారు. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఆసియా, ఆఫ్రికాలోని పట్టణ సమాజానికి మంచి భవిషత్ ఏర్పాటుకు సహకరించుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, ఇంటర్ నేషనల్ క్రాఫ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సెమి యాడేడ్ టాఫిక్స్ ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఐసీఆర్ఐ ఎస్ఏటీ డా.జక్యూలైన్ ఫ్యూజెస్, ఎన్ఐఆర్డీ ఆర్ఎస్ గవళి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, డా.విక్టరీ సఫ, తదితరులు పాల్గొన్నారు.
కీలకంగా మారిన భాగస్వామ్యం
ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలో ఆయిల్ సీడ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు సాయపడనుంది. నాణ్యతమైన విత్తనోత్పత్తులను ప్రోత్సహిస్తూ ఆహార భద్రత, ఆయిల్ సీడ్ ఉత్పత్తిని పెంచేందుకు సాయపడుతుంది. వాతావరణ మార్పులు పంట దిగుబడిని తగ్గిస్తున్నాయని, దీంతో పంట కాలంలో మార్పులు వస్తున్నాయని ఇక్రిసాట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి సవాలుగా మారిన వాతావరణ మార్పులు ముందుగానే గుర్తించే ఆధునిక టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని గుర్తించింది.
ఎగుమతులపై ప్రభావం
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు ఆయిల్ పంటల సాగుకు ఆసక్తి చూపడం లేదని ఇక్రిసాట్ వర్గాలు వెల్లడించాయి. దేశీయంగా ఎగుమతి గొలుసు ప్రోత్సహించేలా రైతులు, ఎక్స్ పోర్టర్లు సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో నూనె గింజలు సాగు చేయకపోవడంతో సోయాబీన్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగును ప్రోత్సహించి రైతులను విజయవంతమైనట్లుగా ఓపెక్, ఇక్రిసాట్ వర్గాలు తెలిపాయి.