అల్వాల్, నవంబర్ 11:ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్ 2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతిరెడ్డికి మచ్చ బొల్లారం డివిజన్ కౌకుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అల్వాల్ మండల విద్యాధికారి మురళీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అరుంధతిరెడ్డి మాట్లాడుతూ తల్లి ప్రోత్సాహంతో తాను ఉన్నత శిఖరాలకు చేరుకున్నానని అన్నారు. కలలు కనడమే కాకుండా, దానికోసం కష్టపడితే ఫలితం వస్తుందని చెప్పారు.
మనమీద మనకు నమ్మకం ఉండాలని, అప్పుడే విజయం చేరువ అవుతుందని ఆమె విద్యార్థులకు ఉద్భోదించారు. తాను కౌకుర్లోనే పుట్టి క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నానని చెప్పారు. కౌకుర్ విద్యార్థులకు క్రీడల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.