అంబర్పేట్ : తెలంగాణలో అత్యంత వెనుకబడిన 28 కులాలను తక్షణమే ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ను తెలంగాణ 28 కులాల ఓబీసీ సాధన జాయింట్ యాక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు బుధవారం కమిటీ చైర్మన్ వెన్న ఈశ్వరప్ప, అధ్యక్షుడు చట్ట శివాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోహన్ చౌహన్, కార్యదర్శి బోరెద ప్రవీణ్ కుమార్, కోశాధికారి వేముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు జాజేరావు వేదాకర్ తదితరులు విద్యానగర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆర్ కృష్ణయ్యను కలిశారు.
అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ కు సిఫారసు చేసిందని, బీసీ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి, బీసీ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో తమను ఓబీసీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
రాజ్యసభలో తమ గళాన్ని వినిపించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకువచ్చి, 28 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా తమ కులాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, విద్య రంగంలో రిజర్వేషన్లు అందక తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉన్నత చదువులకు తమ పిల్లలు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.