HYD Metro | హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఐదుకారిడార్లకు సంబంధించిన ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ (DPR)ని సిద్ధం చేసి కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. కొత్తగా మేడ్చల్ వైపు కారిడార్ కోసం డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. అయితే, మెట్రో రైలు కోసం కేంద్రం నిబంధనలు విధించిందన్నారు. రెండో దశ విస్తరణపై ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. మొత్తం మూడుకారిడార్లను కలిపేలా రెండోదశ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామన్నారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు మెట్రో నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అయితే, మొదటి దశ మెట్రో రైలు నిర్మాణం సమయంలో తన దిష్టిబొమ్మలు దహనం చేశారని.. వారంతా నేడు నేడు పూలదండలతో తనను సత్కరిస్తున్నారన్నారు. మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా రెండో దశ ప్రతిపాదనలు రెడీ చేశామన్నారు. రద్దీ ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు.
ముంబయి, చెన్నైలో రూ.లక్షల కోట్ల ఖర్చు చేసి మెట్రోని విస్తరిస్తున్నారన్నారు. ఇక్కడ విస్తరణ లేకపోవడంతో మూడో స్థానంలో ఉన్నామన్నారు. మెట్రోలో ఢిల్లీ, బెంగళూరు ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉందన్నారు. విస్తరణ జరుగకపోతే తొమ్మిదో స్థానానికి పడిపోతుందన్నారు. ఐదు కొత్త కారిడర్ల విషయానికి వస్తే నాగోల్-శంషాబాద్ ఎయిర్పోర్ట్ , రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలిస్, ఎంజీబీఎస్-చంద్రాయణగుట్ట (ఓల్డ్‌సిటీ), మియాపూర్-పటాన్చెరు, ఎల్బీనగర్-హయత్‌నగర్ ఉన్నాయి. అదనంగా ఫోర్త్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అదనంగా డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. రెండో దశలో ప్యారడైజ్-కండ్లకోయ, మేడ్చల్, జేబీఎస్-తూముకుంట కారిడార్లను చేర్చకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణమని హెచ్ఎంఆర్ అధికారులు పేర్కొన్నారు. ఐదు కొత్త కారిడార్లు మొత్తం 76.4 కిలోమీటర్లు రెండో దశలో మెట్రోను విస్తరించనున్నది. ఇందుకు రూ.24,269 కోట్లు వ్యయం కానున్నది. ఇదిలా ఉండగా.. గత ఏడేళ్లలో హైదరాబాద్ మెట్రోలో 63.40కోట్ల మంతి ప్రయాణాలు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 14న ఒకే రోజు అత్యధిక ప్రయాణాలతో రికార్డును సాధించింది. మియాపూర్-ఎల్బీనగర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గ్ సహా మూడు కారిడార్లలో 5.3 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. 2028 నాటికి రైడర్‌షిప్ మరింత పెరుగుతుందన్నారు.