సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పహాడీషరీఫ్ పరిధిలోని తుక్కుగూడలో 21 ఏండ్ల హత్య కేసును శంషాబాద్ జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పహాడీషరీఫ్ పోలీసులు ఛేదించారు. ఆసుపత్రి గదిలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న బాధితురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో బిహార్‌కు చెందిన మహ్మద్ సనావుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ మేరకు శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాజేశ్ వివరాలు వెల్లడించారు. మృతురాలు 7 నెలల కిందట తన స్నేహితురాలితో కలిసి హైదరాబాద్ వచ్చి, తుక్కుగూడలోని ఓ హాస్పిటల్లో నర్సులుగా చేరి, ఆసుపత్రి క్వార్టర్స్‌లోనే నివాసముంటున్నారు. కాగా, నిందితుడు బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా రుదౌలికి చెందిన సనావుల్లా 2023లో హైదరాబాద్‌కు వచ్చాడు. మొదట్లో ఉప్పల్‌లో ఓ మెకానిక్‌షాపులో పనిచేసి రెండు నెలల కిందటే తుక్కుగూడలోని ఓ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ షాపులో మెకానిక్‌గా చేరిన సనావుల్లాఖాన్.. అదే ప్రాంతంలోని షాపులో నివాసముంటున్నాడు.
సుమారు నెలరోజులుగా తన దుకాణం వెనక ఉన్న కిటికీ నుంచి నర్సులు రాకపోకలు సాగించే మార్గాన్ని గమనించిన అతను ఆమె కదలికలను కొంతకాలంగా పరిశీలించినట్లు విచారణలో తేలింది. ఆగస్టు 28 శుక్రవారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తన గదిలో ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితుడు కిటికీ తెరిచి ఉండడాన్ని ఆసరాగా చేసుకుని లోపలికి ప్రవేశించాడు. అలికిడి విని మేల్కొన్న ఆమె కేకలు వేయబోతుండగా నిందితుడు ఆమె నోరు మూసి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు నిందితుడి వేలిని కొరకడంతో గొంతు, ఛాతీపై గాయాలైనట్లు డీసీపీ పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన నిందితుడు.. ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హతమార్చిన తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత నిందితుడు అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 29న ఉదయం బాధితురాలు గది నుంచి బయటకు రాకపోవడంతో ఆమె స్నేహితురాలు కిటికీ ద్వారా గదిలోకి వెళ్లిచూడగా, రక్తగాయాలతో మృతి చెంది కనిపించింది. దీంతో మృతురాలి పినతల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రాజేశ్ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు సనావుల్లాఖాన్ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మద్యం తాగడం, అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసే అలవాటు ఉందని, దాని ప్రభావంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదికలో మృతురాలిపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో కేసులో లైంగికదాడికి సంబంధించిన సెక్షన్‌ను మార్చనున్నట్లు పోలీసులు తెలిపారు.