తుర్కయంజాల్‌లో హెచ్ఎండీఏ లేఅవుట్.. 9.5 ఎకరాల్లో 34 ప్లాట్లు అమ్మకం
మల్టీపర్పస్ యూజ్ జోన్‌గా అభివృద్ధి .. కనీస ధర చదరపు గజానికి రూ.40 వేలు
రేపు నోటిఫికేషన్ విడుదల
గ్రేటర్లో భూములకు మంచి డిమాండ్ ఉండడంతో మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) స్థలాలను చక్కగా అభివృద్ధి చేసి విక్రయిస్తున్నది. ఇప్పటికే ఉప్పల్ భగాయత్, బహుదూర్‌పల్లి, తొర్రూరు లేఅవుట్లలో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడంతో నాగార్జునసాగర్ ప్రధాన మార్గంలో తుర్కయంజాల్ వద్ద కొత్త అవుట్ అభివృద్ధి చేస్తున్నది. 9.5 ఎకరాల్లో 34 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనుంది. మల్టీపర్పస్ యూజ్ జోన్‌గా ఈ స్థలాలను వినియోగించుకోవచ్చు. అమ్మకాలకు సంబంధించి ఈనెల 31న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, చదరపు గజానికి కనీస ధర రూ.40 వేలు నిర్ధారించారు.
సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ) : నగర శివారులో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొత్త లేవుట్‌ను అభివృద్ధి చేస్తున్నది. తుర్కయాంజాల్‌లో నాగార్జున సాగర్ జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 9.5 ఎకరాల్లో చేస్తున్న లేఅవుట్లో అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఇండ్లు నిర్మించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం అన్ని రకాల మౌలిక వసతులతో ఏర్పాటు చేయనున్నది.
వివిధ విస్తీర్ణంలో మొత్తం 34 ప్లాట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ల (7601046438, 7601063358)లో సంప్రదించాలని అధికారులు తెలిపారు.