సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ) : ఓటరు జాబితా సవరణలో తప్పులను సరిచేయడంతో పాటు, బోగస్ ఓట్ల ఏరివేత కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ ఓటర్లు, అనామలిస్ ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 10న సర్ ప్రక్రియ పూర్తి కావడంతో 17న ముసాయిదా ఓటరు జాబితాను జారీ చేసిన విషయం తెలిసిందే. ముసాయిదా జారీ చేసి ఐదు రోజుల తర్వాత కూడా మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నోటీసులు ప్రచురించడంలో జాప్యం జరిగింది. కానీ శనివారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 130లోని కొందరు ఓటర్లకు స్థానిక జీహెచ్ఎంసీ సిబ్బంది నోటీసులు జారీ చేసింది.
ఆదివారం సెలవు దినం కావడంతో, నోటీసుల ప్రచురణను వేగవంతం చేసి 24న నోటీసుల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నోటీసుల జారీ ప్రక్రియపై అధికారుల ఆలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సుమారు 38.93లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉండగా… వీరిలో నాన్ మ్యాపింగ్ ఓటర్లు 5.8లక్షల మందికాగా, మిగిలిన వారంతా అనామలిస్ ఓటర్లు ఉన్నారు. ఒక జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు డిజిటలైజ్ అయిన ఓటర్లలో నాన్ మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లు కలిపి 12.52లక్షల మందికిపైగా నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసుల జారీ చేయాల్సిన ఓటర్ల వివరాలను క్యూర్ పరిధిలోని మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాల వారీ నోటీసులను తయారు చేసి, ప్రింటింగ్‌కు పంపడమే ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజి గిరి జిల్లాల ఓటరు జాబితా ముసాయిదాను జారీ చేసి ఆరు రోజులు గడిచినా, అనామలిస్, నాన్ మ్యాపింగ్ ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులను క్యూర్ సిటీ పరిధిలోని మూడు కార్పొరేషన్లు ఇంకా సిద్ధం చేయలేదని తెలిసింది. నోటీసుల జారీ ప్రక్రియపై అధికారుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటీసులు జారీ చేయాల్సిన ఓటర్ల వివరాలను క్యూర్ పరిధిలోని మొత్తం 29 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నియమితులైన ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు తమ లాగింగ్ ను ఒకో ఓటరు వారీగా వివరాలు డౌన్ లోడ్ చేసుకుని నోటీసులు క్యూర్ సిటీ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కూడా ఇదే విధంగా ప్రక్రియ సాగుతోంది.
సర్ ప్రక్రియ ప్రారంభించకముందు 33 జల్లాల్లో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లుండగా, సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత డిజిటలైజ్ అయిన ఓటర్లు సంఖ్య 2 కోట్ల 64 లక్షల 87 వేల 213 కు పడిపోయింది. వీటిలో నాన్ మ్యాపింగ్ ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 12.12 శాతం మంది ఉండగా, అనామలిస్ ఓటర్ల శాతం 22.84 శాతంగా ఉంది. ఒక హైదరాబాద్ జిల్లా పరిధిలోనే నాన్ మ్యాపింగ్ అనామలిస్ ఓటర్ల శాతం 45 శాతం వరకు ఉంది. ఒకే కుటుంబంలోని సభ్యులకు చెందిన ఓటర్లకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉండాల్సిన వయోపరిమితి వ్యత్యాసం వంటి ఇతరాత్ర వివరాలు సరిగ్గా లేని ఓటర్లను అనామలిస్ క్యాటగిరీ ఓటర్లని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఇటీవలే నిర్వహించిన సర్ పక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన 2002 సర్ వివరాలు సమర్పించని ఓటర్లను నాన్ మ్యాపింగ్ ఓటర్లుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇలాంటి రెండు క్యాటగిరీల కింద ఓటర్ల తరహాలో రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల 60 వేల 201 మంది అనామలిస్ ఓటర్లుండగా, మొత్తం ఓట్లలో ఇది మ్యాపింగ్ కానీ ఓటర్ల సంఖ్య 6 లక్షల 72 వేల 979 మంది కాగా, ఇది మొత్తం ఓటర్లలో 23.22 శాతంగా కాగా, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో కూడా అనామలిస్ ఓటర్లు 3 లక్షల 34 వేల 252 మంది ఉండగా, ఇది మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 17.52 శాతంగా ఉంది.
ఇదే జిల్లాలో నాన్ మ్యాపింగ్ ఓటర్లు 56.23 శాతం అంటే 10 లక్షల 72 వేల 599 మంది ఉన్నారు. మొత్తం మూడు జిల్లాల్లో ముసాయిదా ప్రకారం 71,15,441 మంది ఓటర్లుండగా, వీరిలో మూడు జిల్లాల్లోని మొత్తం అనామలిస్ ఓటర్లు 15,67,131 మంది కాగా, నాన్ మ్యాపింగ్ ఓటర్లు 23 లక్షల 26 వేల 486 మంది ఉండగా, అనామలిస్, నాన్ మ్యాపింగ్ క్యాటగిరీల కిందనున్న మొత్తం 38 లక్షల 93 వేల 617 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు.
నోటీసులిచ్చిన తేదీ నుంచి ఏడు రోజుల్లో హియరింగ్ నిర్వహించనున్నారు. ఇలాంటి ఓటర్లు తమ ఓటుకు సంబంధించి 2002 సర్ వివరాలు లేకపోయినా, తమ ఓటుకు మూలాలైన తమ తల్లి దండ్రులు, తాతలు, నానమ్మల సర్ వివరాలను సమర్పిస్తే, తుది జాబతాలో వారు వివరాలు ప్రచురించనున్నారు. 2002 సర్ వివరాలు, ఇతర ఆధారాలు సమర్పించని ఓటర్ల వివరాలు జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. లక్షల మందికి నోటీసులు జారీ చేసి, హియరింగ్ లు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకున్నందున, ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాకు ఫిక్స్ చేసుకున్న అక్టోబర్ 19వ తేదీని మరింత ముందుకు పొడిగించుకోవల్సిన పరిస్థితి లేకపోలేదు.