మేడ్చల్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచే మేడ్చల్ జిల్లావ్యాప్తంగా వివిధ సహకార సంఘాల చైర్మన్లు, రైతు సంఘాల నాయకులు, రైతులను ముందస్తుగా అరెస్టు చేసి.. ‘చలో ప్రజాభవన్’ను అడ్డుకున్నారు. శామీర్‌పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, రైతు సంఘం నాయకులు బహుసింగ్, నర్సింహులు, సతీశ్‌రెడ్డి, నారాయణరెడ్డి, భూంరెడ్డి సహకార సంఘాల చైర్మన్లు, రైతు సంఘాల నాయకులను అరెస్టు చేసి.. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ తరలించారు.
పూడూర్ సహకార సంఘం చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మేడ్చల్ సహకార సంఘం చైర్మన్ రణదీప్రెడ్డిలతో పాటు రైతులను మేడ్చల్, పేట్‌బషీరాబాద్ పీఎస్‌లకు తరలించారు. మూడుచింతపల్లి మండలంలోని రైతులను ప్రజాభవన్‌కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పెద్ద మోసం చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ కాని రైతులు ప్రజాభవన్ వెళ్తుంటే అక్రమ అరెస్టులు చేయ డం సిగ్గు చేటన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతులంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. కాగా, పిరం చెరువు గ్రామంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు, ఉప్పర్‌పల్లిలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే నర్కూడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీశ్‌ను, పెద్దతూప్ర గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ దంపతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.