నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 10: కాంగ్రెస్ పార్టీని రెబల్ అభ్యర్థుల బెడద వెన్నాడుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం పలు నియోజకవర్గాల్లో పలువురు నేతలు కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేయడంతో టికెట్లు పొందినవారు తలలు పట్టుకుంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పీసీసీ మాజీ కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పగిడి రామలింగయ్యయాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆలేరు నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ నేత కుడుదుల నగేశ్ రెబల్‌గా అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ వేసిన అనంతరం రామలింగయ్యయాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం చేసిందని కుడుదుల నగేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలు బండ్రు శోభారాణి, బోరెడ్డి అయోధ్యరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన పార్టీ బహిరంగ సభకు నగేశ్‌తోపాటు వీరిద్దరూ హాజరుకాలేదు.
పాలకుర్తిలో కాంగ్రెస్ ఆగమాగం
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. ఆ పార్టీ అభ్యర్థి యశస్వినిరెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించే అవకాశం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలకుర్తి టికెట్ ఆశించిన ఎన్నారై ఝాన్సీరెడ్డికి పౌరసత్వం సమస్య ఎదురుకావడంతో ఆమె తన కోడలు మామిడాల యశస్వినిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే గురువారం పాలకుర్తి రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేసిన యశస్వినిరెడ్డి సరైన తాజా ఓటరు గుర్తింపు పత్రాలు అందజేయలేదు. నాగర్‌కర్నూల్ జిల్లా దిండిచింతలపల్లి గ్రామ ఓటరుగా నమోదైన తాజా ధ్రువపత్రాన్ని ఆమె శుక్రవారం ఆర్వోకు సమర్పించారు. అయితే యశస్వినిరెడ్డి పాస్‌పోర్టులో మాత్రం హైదరాబాద్ చిరునామాను పేర్కొంటూ అక్కడి ఓటరు గుర్తింపుకార్డును జత చేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే అభ్యర్థిని మార్చేందుకు వీలుగా కాంగ్రెస్ నేతలు బీ-ఫాంతోపాటు ఏ-ఫారం కూడా రిటర్నింగ్ ఆధికారికి అందజేశారు. పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ చేత నామినేషన్ వేయించారు. మరోవైపు వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అనుచరులు ఆయన తరఫున శుక్రవారం పాలకుర్తి ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జంగా కాంగ్రెస్ రెబల్‌గా, స్వతంత్ర అభ్యర్థిగా ఉంటారా? లేక ఆయనే పార్టీ అభ్యర్థిగా మారుతారా? లేకుంటే బరిలోంచి తప్పుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.