హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ప్రాంతంలోని సర్వే నంబర్ 215లో చేపట్టిన ‘శేషాద్రి సిల్వర్ ఓక్’ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి లేదని రెరా స్పష్టం చేసింది. కృతిక ఇఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్వంలో తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదు అందినట్టు రెరా తెలిపింది.
ఈ ప్రాజెక్టు రెరాలో రిజిస్టర్ కాలేదని, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి బిల్డింగ్ నిర్మాణ, లేఅవుట్ అనుమతి పొందలేదని పేర్కొన్నది. రెరా చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ కంపెనీ ఎండీ డీ శ్రీకాంత్‌పై గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదుచేయడంతోపాటు సుమారు రూ.10 లక్షల జరిమానా విధించినట్టు వెల్లడించింది.