సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా అందుబాటులోకి వచ్చిన జంక్షన్లలో ట్రాఫిక్ సాఫీగా జరుగుతుండగా.. ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్, ఆర్యూబీ, ఆర్వోబీ లేని చోట జంక్షన్లు జాం అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం అయితే చాలు నిమిషాల కొద్దీ వాహనదారులు బారులు తీరుతున్నారు. జంక్షన్ దాటాలంటే వాహనదారులకు కత్తి మీద సాములా మారింది. ఉదాహరణకు జంక్షన్‌కు ఇరు వైపులా అర కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరి ఉంటాయి. దీంతో ఈ జంక్షన్ దాటాలంటే 15 నిమిషాల సమయం పడుతుంది. వాస్తవంగా గడిచిన 18 నెలలుగా ప్రతిపాదిత ఆర్వోబీ, ఆర్యూబీ ప్రతిపాదనలు పట్టాలెక్కపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కొత్తగా 42 చోట్ల..
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 42 చోట్ల ఆర్వోబీ, ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి) పనులకు బీఆర్ఎస్ హయాంలో ప్రతిపాదనలు రూపొందించారు. ఎక్కువగా రైల్వే శాఖ ఆధీనంలో ఉండగా.. ఐదు చోట్ల ఆర్వోబీ, ఆర్యూబీ పనులపై స్పష్టతను తీసుకువచ్చారు. ఇందులో చార్మినార్ జోన్ యాకత్‌పుర ఆర్యూబీ, సికింద్రాబాద్ జోన్ మాణికేశ్వరనగర్ ఆర్యూబీ, చార్మినార్ జోన్ శివరాంపల్లి ఆర్వోబీ పనులను పట్టాలెక్కించారు.
సికింద్రాబాద్ జోన్ చిలకలగూడ ఆర్యూబీ, గౌతంనగర్ ఆర్యూబీ పనులకు రైల్వే శాఖ ఆమోదం తీసుకున్నారు. అయితే పనులను పట్టాలెక్కించాల్సిన ప్రజా పాలన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఏ ఒక్క చోట పురోగతి సాధించలేదు. కనీసం 24 చోట్ల ఆర్యూబీ. ఆర్వోబీ ప్రతిపాదనలపై కనీసం రైల్వే శాఖతో సంప్రదింపులు జరపకపోవడం గమనార్హం. హెచ్ఆర్డీసీఎల్, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో తొమ్మిది ఆర్వోబీ, ఆర్యూబీల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో ఈ పరిసర ప్రాంతాల వాసులకు ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఆర్వోబీ, ఆర్యూబీ ప్రతిపాదనలను పట్టాలెక్కించాలని స్థానికులు కోరుతున్నారు.