ఖైరతాబాద్, ఆగస్టు 5 : నిమ్స్ దవాఖానకు 24 గంటల పాటు రక్షణ ఉండే సెక్యూరిటీ గార్డుల జీవితాలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం వేలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. రోజూ సుమారు 2వేలకు పైగా మంది వివిధ చికిత్సల కోసం వస్తారు. ఈ నేపథ్యంలో వారు వైద్యులను కలిసి, చికిత్స తీసుకొని తిరిగి సురక్షితంగా వెళ్లేంత వరకు వారిని అంటిపెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తారు సెక్యూరిటీ గార్డులు.
అయితే, వారికి సరైన వేతన వ్యవస్థ లేకపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీల దాష్టికానికి బలవుతూ.. సమయానికి వేతనాలు లేక బతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కిరాయి ఇండ్లలో ఉంటూ పిల్లలను చదివించుకుంటూ సమయానికి వేతనాలు రాక అప్పులపాలవుతున్నారు. దశాబ్ద కాలంగా నిమ్స్ సెక్యూరిటీ గార్డులు ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లో నలిగిపోతున్నారు. ఎవరిని కదిలించినా.. వారి కష్టాలు చెప్పుకొని కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు లేక, అసంఘటితరంగం కంటే అధ్వానమైన జీవితాలు గడుపుతున్నారు.
గత రెండు నెలలుగా సదరు ఏజెన్సీ వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. మరో వైపు మహిళా సెక్యూరిటీ గార్డుల వెతలు చెప్పనలవి కాదు. గతంలో కొందరు మహిళా సెక్యూరిటీ గార్డులపై వివిధ రకాలుగా వేధింపులు జరిగిన ఘటనలు సైతం నిమ్స్ దవాఖానలో చోటు చేసుకున్నట్లు సమాచారం.
మరో వైపు వేతనాలు రాక, కుటుంబాలను పోషించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, సోమవారం విధులను బహిష్కరించిన సెక్యూరిటీ గార్డులు.. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే చాలీ చాలని వేతనాలు కూడా చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఒక్క రోజు సెలవు పెట్టినా..
నిమ్స్ దవాఖానలో క్యాపిటల్ ఏజెన్సీ కింద సుమారు 105 మంది సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ నిర్ణీత వేతనం కనీసం నెలకు రూ.15,600 చెల్లించాల్సి ఉంది. కానీ సదరు ఏజెన్సీ మాత్రం సెక్యూరిటీ గార్డులకు రూ.11,500 మాత్రమే చెల్లిస్తూ చేతులు దులుపుకుంటున్నది. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క కార్మికుడికి పనిదినాలు, పనివేళాలు ఉంటాయి. కానీ నిమ్స్ సెక్యూరిటీ గార్డులది మాత్రం వెట్టిచాకిరి అంటున్నారు. నెలకు నాలుగు వీక్లీ ఆఫ్లు ఉన్నాయి. అయితే ఆ నిబంధనలు వీరికి వర్తించవు. ఒక్క రోజు సెలవు పెట్టినా రూ.500 వారి వేతనం నుంచి కట్ చేస్తారు.
ఇంటికి నేనే ఆధారం
నిమ్స్ దవాఖానలో పదేండ్లుగా పనిచేస్తున్నాను. అన్ని సంవత్సరాలుగా నాది అదే పరిస్థితి. ఏజెన్సీల దయాదాక్షిణ్యాల మీద గడుపాల్సి వస్తున్నది. నా భర్త పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. ఇంటి మొత్తానికి నేనే ఆధారం. రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో అక్కడక్కడ అప్పులు తీసుకొని.. కాలం వెల్లదీస్తున్నా. మా గోడు వినే వారే లేరు.
– పావని, నిమ్స్ మహిళా సెక్యూరిటీ గార్డు
భర్త చనిపోవడంతో..
నా భర్త చనిపోవడంతో కుటుంబ భారమంతా నాపైనే పడింది. నాకు బాబు, పాప ఉన్నారు. ఒకరు 9వ తరగతి, మరొకరు 8వ తరగతి చదువుతున్నారు. కిరాయి ఇంట్లో ఉంటూ వారిని చదివించుకునేందుకు అనేక కష్టాలు పడుతున్నాను. నా పిల్లల పోషణకు నా సంపాదనే దిక్కు. పిల్లల చదువులకు సరిపోకపోవడం వల్ల అప్పులు చేయాల్సి వస్తున్నది. అత్యంత దుర్భరమైన జీవితాలను గడుపుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– కె.కవిత, నిమ్స్ మహిళా సెక్యూరిటీ గార్డు