మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే.. : మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి
బడంగ్‌పేట, జనవరి16: నూతన హంగులతో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎకరా ఆరు గుంటల స్థలంలో భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు అవుతున్నాయని పాలకవర్గం సభ్యులు కొత్త భవనం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకుపోయారు. మంత్రి ఈ విషయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి నుంచి సానుకూలంగా స్పందన రావడంతో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త భవనం కోసం ఏకగ్రీవ తీర్మాణం చేశారు. కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన పత్రాలను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కొత్త మున్సిపల్ భవన నిర్మాణం పనులు పూర్తయితే సమస్య ఉండదని పాలకవర్గ సభ్యులు చెబుతున్నారు.
మున్సిపల్ పరిధిలో కొత్త భవనాలు..
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్త భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకేచోట మున్సిపల్ భవనం, క్రీడా మైదానాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వంద పడకల దవాఖాన, ప్రజా భవనం, గోదాం, పార్కుల నిర్మాణం చేయిస్తున్నాం. జిల్లా గ్రంథాలయం నిర్మించాం. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అవసరమైన నిధులు, స్థలం కేటాయించడానికి పూర్తి స్థాయిలో సహకరించినందుకు కృతజ్ఞతలు.
రూ.7కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ భవనం
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రూ.7కోట్లు కేటాయించారు. 1.6 ఎకరాలలో ఈ భవనం నిర్మాణం జరుగుతుంది. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీచేశాం. నాణ్యతాప్రమాణాలతో నూతన భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశకు వచ్చాయి. – కృష్ణ మోహన్ రెడ్డి, కమిషనర్
మంత్రి సహకారంతోనే..
బడంగ్‌పేట దావుత్ ఖాన్ గూడలో కొత్త మున్పిల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. స్థలం ఇబ్బందిగా ఉంటే మంత్రి చొరవతో సమస్య పరిష్కారమైంది. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ భవనం సరిపోక పోవడంతో మంత్రి దృష్టికి తీసుకుపోయాం. రెండు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయి.