వెంగళరావునగర్, డిసెబంర్ 19: పగలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వంట చేస్తూ.. రాత్రి సమయాల్లో హాస్టళ్లలో ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నేపాల్‌కు చెందిన ఇద్దరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 51 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్‌లతో కలిసి ఏసీపీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు. నేపాల్‌కు చెందిన గోవింద్ భండారి, హిక్మత్ రావల్‌లు బావమరుదులు. జీవనోపాధి నిమిత్తం 6 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చారు.
గోవింద్ హైటెక్‌సిటీ వద్ద ఫాస్ట్ ఫుడ్సెంటర్లో, రావల్ రాణిగంజ్‌లోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో వంట పనిచేస్తుంటారు. అయితే.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పగలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వంటయ్యాక.. రాత్రయ్యాక ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని హాస్లళ్లలో సెల్ఫోన్లను చోరీ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఆర్నగర్లోని హాస్టళ్లే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల పోలీస్స్టేషన్ల పరిధుల్లోని హాస్టళ్లల్లో కిటికీల పక్కన, బ్యాగుల్లో, పుస్తకాల మాటున, ట్రేలలో పెట్టుకున్న సెల్ఫోన్లను గోవింద్ కాజేసి.. రావల్‌కు ఇచ్చేవాడు. ఈ సెల్ఫోన్లన్నీ నేపాల్ దేశానికి తీసుకెళ్లి విక్రయించాలని భావించారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా..
కాగా.. సెల్ఫోన్ల చోరీలపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఆర్నగర్ ప్రాంతంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ర్యాపిడో బైక్‌పై వచ్చి చోరీలకు పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చి..బైక్ బుక్ చేసిన కస్టమర్, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చోరీచేసిన ఫోన్లన్నీ నేపాల్‌కు తీసుకెళ్లేందుకు హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు వారిద్దరు చేరుకోగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 51 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరి చేసిన సొత్తు రూ.10.20 లక్షలు విలువ ఉంటుందని ఏసీపీ చెప్పారు.