హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : మైనింగ్ రంగంలో కృత్రిమ మేధస్సును (ఏఐ) వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఓయూ, కేయూ వర్సిటీల మైనింగ్ పూర్వ విద్యార్థుల సంఘం- మైనింగ్ ఇంజినీర్ల అసోసియేషన్ (ఎంఈఏఐ) హైదరాబాద్ చాప్టర్ ‘అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మినరల్ ఇండస్ట్రీస్’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నిత్య జీవితంలో ఏఐ భాగమైపోయిందని, మైనింగ్ రంగంలో ఇప్పుడిప్పుడే ఈ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.
ఇందులో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పూర్వ విద్యార్థుల సంఘం, విశ్రాంత మైనింగ్ ఇంజినీర్లు చొరవ తీసుకుంటుండటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో మైనింగ్‌లో ఏఐతో దేశం గణనీయంగా వృద్ధి సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ, కేయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బికి రమేశ్ కుమార్, ఎంఈఏఐ వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.వెంకటరామయ్య, కమిటీ కన్వీనర్ కె.జె.అమర్ నాథ్, ఎన్ఎండీసీ మాజీ సీఎండీ బి.రమేశ్ కుమార్, ఎంఈఏఐ హైదరాబాద్ చాప్టర్ మాజీ చైర్మన్ బి.ఆర్.వి.సుశీల్ కుమార్, రూరేలా ఎన్ఐటీ మైనింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సింగమ్ జయంత్, ప్రొఫెసర్ కార్తీక్, సింగరేణి అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.