సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ ) : ప్రకృతిపై అపారమైన ప్రేమ, గ్రామీణ సంసృతిపై ఉన్న గౌరవంతోనే ‘టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఎక్స్పీరియం-2026ను నిర్వహించాలనే ఆలోచన చేశాం తప్ప, ఇందులో ఎలాంటి వ్యాపార కోణం కానీ, స్వలాభం కానీ లేదని ఎక్స్పీరియం ఎకో పార్కు ఫౌండర్ రాందేవ్ రావు స్పష్టం చేశారు. సమాజంలో కొందరు వ్యక్తులు ఈ ఫెస్టివల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా, ఎవరి మనోభావాలను గాయపరచకుండా, తన ఆలోచనల వెనుక ఉన్న నిషల్మషమైన ఆశయాన్ని ఆయన వివరించారు.
సమాజంలో అనవసర వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ ‘టాడి ఫెస్టివల్’ను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం మీడియా సమావేశంలో రాందేవ్ రావు ప్రకటించారు. ఈ రద్దు నిర్ణయం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని, ప్రకృతిపై తమకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదన్నారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రకృతి వనాల అభివృద్ధి కోసం త
మ వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎవరి బిజినెస్‌ని లాకోవడానికీ కాదు. నేను నా ఇతర వ్యాపారాలను వదిలి గీత కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ టాడి మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించాలనుకున్నానని రాందేవ్ రావు వివరించారు. నేను ఒక గ్రీన్ లవర్ని. నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను భూమిలో పెట్టకండి, కాల్చకండి. ఒక చెట్టు తొర్రలో పెట్టండి. అని చెప్పానని చెప్పాను. కల్లు మీద ఉన్న అభిమానంతో తాటి చెట్లను కూడా కలెక్ట్ చేయడం జరిగిందని, దాదాపు 270 వెరైటీల తాటి చెట్లను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తెచ్చి, దాదాపు 10 కోట్లు వెచ్చించి, ఇండియాలో ఎవరి దగ్గర లేనన్ని చెట్లను తను సేకరించినట్లు గుర్తు చేశారు.
కల్లు మీద ఉన్న ప్రేమతో వివిధ దేశాల్లో స్టడీ చేశానని, తాటి సంబంధిత ప్రొడక్ట్స్ మారెట్ సిచుయేషన్ ఏంటి అని తెలుసుకుని ఇక్కడ కల్లుకు ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నానని తెలిపారు. ఇంత అభిమానం ఉన్న తనను కొందరు ఎందుకు నెగిటివ్‌గా తీసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను గవర్నమెంట్‌తో కుమ్మకయ్యానని కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకువచ్చారని, కల్లును ఇష్టపడే వ్యక్తిగా , కల్లుకు ప్రాచుర్యం కల్పించాలన్నదే నా ఉద్దేశమని, మరీ ముఖ్యంగా కల్లును ఒక స్టేటస్ సింబల్‌లా చేయాలని అనుకుంటున్నానని వివరించారు.
టాడి మ్యూజికల్ ఫెస్టివల్ ప్రకటన సందర్భంలో నేను కల్లు బిజినెస్ చేస్తానని ఎకడా అనలేదని స్పష్టం చేశారు.. ఇది రాష్ట్ర డ్రింక్‌గా డిక్లేర్ చేయమని కూడా నేను అన్నానని, ఇందులో తప్పేం ఉందన్నారు. ఒక ఎకరంలో ఈత చెట్లు, తాటి చెట్లు, జీళ్లు చెట్లు పెడితే గీత కార్మికులు ఫార్మింగ్ చేసుకోవచ్చని.. ప్రతి ఒకరూ చేస్తే వారి లైవ్లీహుడ్ బాగుంటుందన్నారు. కేవలం అభిమానంతో, గవర్నమెంట్‌కు ఒక కనువిప్పు రావాలనే ఉద్దేశంతోనే తప్ప..ఇందులో కొందరు ఈ కార్యక్రమాన్ని నెగిటివ్ చూడడాన్ని తీవ్రంగా రాందేవ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
టాడి ఫెస్టివల్ ఎవరికీ వ్యతిరేకం కాదు. మారుతున్న కాలంతో పాటు గీత వృత్తిని, కల్లు అనుబంధ ఉత్పత్తులను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాందేవ్ రావు చెప్పారు. తనపై నెగిటివ్ ప్రచారాలు చేసే వారు వాస్తవాలను గ్రహించుకోవాలని, తనపై ఉన్న అపోహలను, ప్రతికూల భావాలను తొలగించుకోవాలని, గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు బాధ్యత పోషిస్తానని రాందేవ్రావు తెలిపారు . ఈ సందర్భంగా గ్రామీణ జీవన విధానంలో భాగమైన తాటి చెట్టు విశిష్టతను నేటి తరానికి పరిచయం చేయాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి చేపట్టాలనుకున్నానని రాందేవ్రావు చెప్పారు.
మానవ జీవన ప్రయాణంలో తాటి చెట్టు పాత్ర అనన్యసాన్యం. తాటి ఆకులతో ఇళ్లకు కప్పులు వేసుకోవడం, తాటి చాపలు, తాటి విసన కర్రలు, తాటి బుట్టలు చేయడం, తాటి ముంజలు వేసవిలో ఇచ్చే చలువ, ఆరోగ్యం అమూల్యం తదితర అంశాలు మన సంసృతిలో భాగమని వివరించారు. తాటి చెట్టు వేరు నుంచి చివరి ఆకు వరకు ప్రతిదీ మానవాళికి ఉపయోగపడేదేనని, అలాంటి వృక్ష సంపదను, గ్రామీణ కళలను గౌరవించాలనేదే ఆశయంతో టాడి ఫెస్టివల్ చేపట్టి..తద్వారా గీత కార్మికులకు అండగా తన వంతు బాధ్యతగా నిలవాలనుకున్నానని వివరించారు.
తాను కల్లు వ్యాపారం ద్వారా సొమ్ము సంపాదిస్తున్నానని లేదా ఆ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నానని ఎవరైనా నిరూపిస్తే, వారికి రూ. కోటి బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రాందేవ్ రావు సవాల్ విసిరారు. పనిగట్టుకుని తనను టార్గెట్ చేస్తూ పాయింట్ అవుట్ చేస్తున్న వారు ఈ సవాల్‌ను స్వీకరించాలని, ఆధారాలు ఉంటే తన ముందుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలో తాను కేవలం సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహం,మారెటింగ్ కోణంలోనే కొన్ని సూచనలు చేశానని స్పష్టం చేశారు.
ఐదు నక్షత్రాల (ఫైవ్ స్టార్) హోటళ్లతో పాటు అన్ని బార్లలో బీరుతో పాటు కల్లును కూడా అందుబాటులో ఉంచి విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, దీనివల్ల స్థానిక గీత కార్మికులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేశానని వివరించారు. ఈ భావనను తప్పుగా చిత్రీకరిస్తూ కొందరు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘నాకు సొంతంగా ఎలాంటి కల్లు వ్యాపారం లేదని, అందులో పెట్టుబడులు కూడా లేవని స్పష్టం చేశారు. కేవలం గీత కార్మికుల సంక్షేమం కోసమే మాట్లాడాను తప్ప, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదన్నారు..