Hyderabad | హైదరాబాద్ శివారులోని నార్సింగి డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో లావణ్య కీలకం కావడంతో ఆమె బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు.. సినీ ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న పరిచయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ఉనిత్ రెడ్డి, ఇందిరతో కలిసి లావణ్య డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. లావణ్య బ్యాచ్ ఒక్క గ్రాము రూ.6వేలకు అమ్ముతున్నట్లుగా తెలుసుకున్నారు.
విజయవాడకు చెందిన లావణ్య ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించింది. పలు షార్ట్ ఫిలింస్‌లో హీరోయిన్‌గానూ చేసింది. ఇలా టాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే లావణ్య జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతని ప్రియురాలిగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్‌ను ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
కాగా, మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభించాయి.
ఈ క్రమంలో లావణ్య ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్ తీసుకుంటుందా? లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.