సాగర తీరంలో సంగీత సుస్వరాలు జాలువారనున్నాయి. హుస్సేన్‌సాగర్‌లో సరికొత్తగా రూ. 17 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఫార్ములా ఈ -రేస్, సచివాలయ ప్రారంభం ఉన్న నేపథ్యంలో.. ఈ నెలాఖరు నాటికే ఫౌంటెయిన్‌ను బిగించి ట్రయల్ రన్ చేయాలని హెచ్ఎండీఏ అధికారులు పట్టుదలతో ఉన్నారు.
సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : హుస్సేన్ సాగర్ తీరం సరికొత్తగా ముస్తాబవుతున్నది. కుటుంబ సమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. పచ్చని మైదానాల నుంచి వీచే పైరగాలులు, నీటి అలలపైకి పరుచుకునే కొత్త దారులు, గాలిలో తేలియాడే వంతెనలు, ఆటస్థలాలు, థీమ్ పార్క్‌లు.. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు కనువిందు చేయబోతున్నాయి. తాజాగా రూ.17 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అత్యాధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఫిబ్రవరి 11న జరుగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు ముందు సాగర్‌లో మ్యూజికల్ ఫౌంటెయిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ మార్గ్ రోడ్ సైడ్‌లో ఏర్పాటు
180 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఎన్టీఆర్ మార్గ్ రోడ్ సైడ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఫౌంటెయిన్లకు అవసరమైన నాజిల్‌ల సంఖ్య 700, ఒక్కో నాజిల్ ఎత్తు 3-20 మీటర్ల మధ్య ఉండేలా నిర్ణయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులను కాంట్రాక్టు పొందిన సంస్థ చేపడుతున్నది. ఈనెలాఖరు వరకు అన్ని బిగించి ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
సాగరతీరం పర్యాటక కేంద్రం..
హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్‌సాగర్ వందలాది ఏకరాల విస్తీర్ణంలో ఉన్నది. దాని చుట్టు ఉన్న తీర ప్రాంతాన్ని సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ఒక్కో చోట ఒక రకమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, పీ.వీ.నరసింహారావు మార్గం( నెక్లెస్ రోడ్), సంజీవయ్య పార్కు, జలవిహార్, పీవీఘాట్, థ్రిల్ సిటీ, నైట్ బజార్.. ఇలా పలు సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని దశల వారీగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జలవిహార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కొత్తగా లేక్ వ్యూ పార్కును సైతం సరికొత్త డిజైన్లతో నిర్మిస్తున్నారు. గత ఏడాది నెక్లెస్ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించి, ఈ మార్గంలో సందర్శకులు రోజంతా హాయిగా కుటుంబ సమేతంగా గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్‌ను నగరంలోనే సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
వేగవంతంగా పనులు
ఫిబ్రవరి నెలలో హుస్సేన్‌సాగర్ తీరంలోనే రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన ఫార్ములా -ఈ కార్ రేసింగ్ 11న, రాష్ట్ర నూతన సచివాలయం 17వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాట్లను వేగవంతం చేశారు.