శేరిలింగంపల్లి, అక్టోబర్ 14: గోపన్‌పల్లి మేస్త్రీ హత్య కేసు మిస్టరీని గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. మృతుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియు డు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడితో పాటు మృతుడి భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సురేశ్ కథనం ప్రకారం.. గోపన్‌పల్లి తండాలో ఉంటున్న శేఖర్‌నాయక్ (30), జ్యోతి దంపతులు. వీరు భవన నిర్మాణ పనులు చేస్తుంటారు. ఇటీవల నిర్మాణ పనుల సూపర్వైజర్గా పనిచేస్తున్న మాణిక్యంతో జ్యోతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త శేఖర్ నాయక్‌కు విషయం తెలియడంతో పలు మార్లు గొడవలు జరిగాయి. మాణిక్యం, జ్యోతి కలిసి శేఖర్ నాయక్ అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం మాణిక్యం ఆదివారం రాత్రి శేఖర్‌నాయక్‌ను మద్యం తాగేందుకు తీసుకువెళ్లి మద్యంలో పురుగుల మందు కలిపాడు. అది తాగిన శేఖర్ నాయక్ అపస్మారకస్థితిలోకి వెళ్లగానే మాణిక్యం గొడ్డలితో హత్య చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు గురువారం నిందితులు మాణిక్యం, జ్యోతిని రిమాండ్‌కు తరలించారు.