మెహిదీపట్నం ఆగస్టు 13: ట్రావెల్ ఏజెంట్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమ మార్గంలో డ బ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆరుగురు యువకులు ఈ దారుణానికి ఒడిగిన ట్లు వెల్లడైంది. అయితే ప్రధాన నిందితుడు తప్ప..అందరూ గంజాయి సేవించే వారే కావడం గమనార్హం. హత్య సమయంలో సైతం గంజాయి మత్తులోనే ఉన్నట్లు తెలిసింది. గత శనివారం (ఆగస్టు 7 )రాత్రి హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎండీసీ సమీపంలోని ఓ కాంప్లెక్స్‌లో ట్రావెల్ పాయింట్ యజమాని ఖాజీ నజీముద్దీన్‌ను ఆగంతకులు కత్తులతో పొడిచి చంపారు. ఈ కేసు మిస్టరీని హుమాయూన్‌నగర్ పోలీసులు ,పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ సహకారంతో ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాసాబ్‌ట్యాంక్ అహ్మద్ నగర్ ఫస్ట్‌లాన్సర్‌లో నివసించే సమీర్(25), ఇమ్రాన్, సాధిక్, తౌఫీక్, మతిన్, ఇర్ఫాన్ స్నేహితులు. వీరిలో సమీర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. సమీర్ తప్ప.. మిగితా వారందరూ తరచూ గంజాయి సేవిస్తుంటారు. నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమ వసూళ్లతో డబ్బులు సంపాదించాలని సమీర్ పథకం పన్నాడు. స్నేహితులకు హత్య పథకాన్ని వివరించి.. ట్రావెల్ పాయింట్ యజమానిని చంపారు. శుక్రవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.