ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) 235 ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేసింది. తాత్కాలిక పరీక్షా ఫలితాలపై అభ్యర్థులు ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఎంఎంఆర్డీఏ నియామక పరీక్షలో కొందరు అభ్యర్థులు 200కు 200 మార్కులు సహా అసాధారణ రీతిలో అత్యధిక మార్కులు సాధించడంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించింది. ఈ నియామకం కోసం మొత్తం 26,749 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 20,459 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వతంత్రంగా పరిశీలించడానికి ఎంఎంఆర్డీఏ ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.