అమీర్‌పేట్ : తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టే క్రమంలో నిత్యం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ ధూప దీప, నైవేద్య అర్చక సంఘం మంగళవారం అమీర్‌పేట్‌లోని హనుమాన్ దేవాలయంలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించింది.
సంఘం అధ్యక్షులు దౌలతాబాదు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ గోత్రనామాలతో నిర్వహించిన మృత్యుంజయ హోమానికి ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు ఎస్.వేణుగోపాలచారి విచ్చేశారు.
హోమం అనంతరం ఎస్.వేణుగోపాలచారి మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణకు విశిష్ఠ స్థానాన్ని సముపార్జించి పెట్టిన సీఎం కేసీఆర్ భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని సేవలందించేలా భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని తనతో పాటు ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణలో ధూప దీప, నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలు కళాకాంతులతో కళకళలాడేలా బడ్జెట్‌తో నిరాదరణకు గురవుతున్న ఆలయాల నిర్వహణకు సీం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.
ఈ హోమంలో సంఘం ప్రతినిధులతో పాటు తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షులు పరాశరం రవీంద్రాచార్యులు, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాండూరి కృష్ణమాచార్యులు, ధూప దీప, నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.ప్రసాద్‌శర్మ, హరికిషన్ శర్మ, ఎం.భార్గవాచార్యులు, అమరేశ్వర శర్మ, లక్ష్మికాంతాచార్యులు, రాచప్పస్వామి, రాజేష్, నటరాజు, శివ, గోపీనాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు.