– ఏనుగు సుదర్శన్‌రెడ్డి
ఘట్కేసర్ రూరల్, మార్చి 16 : ప్రైవేట్ పాఠాశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచ డంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల పరిధి కాచవానిసింగారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన టాయిలెట్స్, బాత్ రూంల నిర్మాణాలకు ఎంపీపీ బుధవారం భూమి పూజ చేశారు. మండలంలోని 11 పంచాయతీల పరిధిలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాఠశాలలలో టాయిలెట్స్, బాత్ రూంలు లేని కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పాఠశాలల పూర్వవిద్యార్థులు, దాత లు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణ, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ గీత, పంచాయతి సభ్యులు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, నాయకులు మధు, అశోక్, ముత్యాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.