మాదాపూర్/కొండాపూర్/మియాపూర్, ఏప్రిల్ 22: ముస్లింల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యానగర్ కాలనీలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు ఎంపీ రంజిత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్‌తోపాటు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలను తెలుపుతు ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. విశ్వమానవ శాంతి కొరకు జరిగే రంజాన్ ప్రార్థనల ద్వారా అల్లా దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పేద ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయడం, అధికారికంగా ఇఫ్తార్ విందు ఇచ్చి వారి ఆత్మ గౌరవాన్ని నిలిపేలా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మైనారిటీ నాయకులు మునాఫ్ ఖాన్, లియాకత్, రహీం, బాబూ మియా, సలీం, మియాన్, అంకారావు, రాములు యాదవ్ తదితరులు ఉన్నారు.