శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5: గచ్చిబౌలిలోని ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) క్యాంపస్‌లో అత్యాధునిక హంగులతో ప్రపంచస్థాయి విద్య, నాయకత్వ లక్షణాలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పెంపొందించే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటుచేసిన మోతీలాల్ ఓశ్వాల్ ఎగ్జిక్యూటీవ్ సెంటర్(ఎంఓఈసీ)ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం ప్రారంభించారు. ఓస్వాల్ పౌండేషన్ అందజేసిన రూ.100 కోట్ల విరాళంతో 1.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్థుల అత్యాధునిక కేంద్రం, 700 మంది విద్యార్థులకు సరిపడ విశాలవంతమైన ఆధునిక తరగతి తదులు, కాన్పరెన్స్ హళ్లు కలిగిన అకాడమిక్ ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్ హబ్‌గా దీనిని తీర్చిదిద్దారు.
ఈ సెంటర్ ద్వారా మొదటి సంవత్సరంలోనే 100కు పైగా సంస్ధలకు చెందిన 600 మంది కార్పొరేట్ లీడర్లకు 200 పైగా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్స్లను అందించనున్నారు. అత్యాధునిక ఉపన్యాస థియేటర్లు, ప్రత్యేక ప్యాకల్టీ లాంజ్, సహకార వర్క్‌స్పేస్‌లతో అవిష్కరణ నిర్ణయాలకు అనువుగా ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇండియన్ బిజినెస్ స్కూల్ కేవలం ఓ విద్యాసంస్ధగా కాకుండా వ్యుహత్మక భాగస్వామిగా అభివర్ణించారు.
మోతీలాల్ ఓశ్వాల్ పౌండేషన్ ఛైర్మన్ మోతీలాల్ ఓశ్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపార స్ఫూర్తి, బాధ్యతతో కూడిన భవిష్యత్తు నాయకులను పెంపొందించేందుకు ఈ సెంటర్ సేవలు విస్తృతం చేస్తుందన్నారు. భవిష్యత్తు తరాలకు విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మోతీలాల్ ఓశ్వాల్ ఎగ్జిక్యూటీవ్ సెంటర్ బిజినెస్ ఎడ్యుకేషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి, ఐఎస్జీ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు అభ్యస అనుభవాన్ని పెంపొందించడానికి మా నిభద్దతను ప్రతిభింబిస్తుందని మోతీలాల్ ఓశ్వాల్ పౌండేషన్ ఛైర్మన్ మోతీలాల్ ఓశ్వాల్, ఐఎస్జీ డీన్ మధన్ పిల్లుట్ల పేర్కొన్నారు. ఓశ్వాల్ పౌండేషన్ ట్రస్టీ రాందేవ్ అగర్వాల్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.