విదేశాలను తలపిస్తున్న ఐటీ నగరి
ఐటీ కారిడార్‌లో ఆధునిక వ్యాపార కేంద్రాలు.. భారీ సముదాయాలు
అలరిస్తున్న ఆటవిడుపు కేంద్రాలు
టెక్కీ అభిరుచులకనుగుణంగా సరికొత్త థీమ్‌లు
సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్ ఆధునికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు నగర రూపు రేఖలను ఒక్కసారిగా మార్చివేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను దాటి ఐటీ కారిడార్‌లో అడుగు పెట్టగానే సరికొత్త నగరం నగరవాసుల కళ్ల ముందు కదులాడుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మాదాపూర్ నుంచి ప్రారంభమైన ఐటీ కారిడార్ ప్రస్థానం కోకాపేట దాకా విస్తరించింది. దీంతో మాదాపూర్‌తో పాటు కొండాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, పుప్పాల్‌గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట దాకా విస్తరిస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో భారీ అంతస్థుల భవనాల రాకతో వీధులన్ని విదేశాలను తలపిస్తున్నాయి. ఇప్పటిరకు ఐటీ కారిడార్ అంటే.. జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీల కార్యాలయాలు, నివాస ప్రాంతాలకు నిలయాలు. అలాంటి ఐటీ కారిడార్ ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. అందుకు తాజా నిదర్శనం ఇటీవల కాలంలో మాదాపూర్ హైటెక్ సిటీ, రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో కొత్తగా ఏర్పాటవుతున్న ఆధునిక వ్యాపార కేంద్రాలు. ప్రధానంగా టెక్కీల అభిరుచులకు అనుగుణంగా పలు వ్యాపార సంస్థలు కొత్తగా వెలుస్తున్నాయి.
పగలు విధులకు.. సాయంత్రం సరదాకు…
నిత్యం ఉద్యోగ విధుల కోసం నగర నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులు పగటి పూట వచ్చివెళితే, సాయంత్రం వేళల్లో నగరవాసుల సరదాగా ఐటీ కారిడార్‌కు కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దుర్గం కేబుల్ బ్రిడ్జీ నుంచి మొదలు కొని ఇనార్బిట్ మాల్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, ఐకియా, శరత్ క్యాపిటల్ మాల్, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్‌లో వ్యాపార, వాణిజ్య కేంద్రాల కోసం వచ్చి వెళుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ్లల్లో ఐటీ కారిడార్‌లోని భారీ బహుళ అంతస్థుల అద్దాల మేడల్లో వెలిగే దీపాలతో ఈ ప్రాంతమంతా నగర వాసులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీలో లేనటువంటి భారీ బహుళ అంతస్థుల భవనాలు హైటెక్ సిటీ కేంద్రంగా వందల్లో నిర్మాణం జరుపుకోగా, అదే సంఖ్యలో మరిన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఐటీ కారిడార్ నగర వాసులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది.
ఐటీతో పాటే ఆటవిడుపు కేంద్రాలు
రోజు రోజుకూ ఆధునిక పోకడలు సంతరించుకుంటున్న ఐటీ కారిడార్‌లో సరికొత్త సంస్కృతి ఆవిష్కృతమవుతోంది. నగర నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగాల కోసం వచ్చే వారంతా విధులు నిర్వహించి వెళ్లిపోయేవారు. వీకెండ్ వస్తే చాలు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని మాల్స్, మల్టీప్లెక్సులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. ఐటీ కారిడార్లోనే అన్ని ఒక్కొక్కటిగా సమకూరుతున్నాయి. రాయదుర్గంలో నాలెడ్జ్ సిటీలో ఇటీవల కాలంలో వెలిసిన ఆధునిక వ్యాపార కేంద్రాలే అందుకు నిదర్శనం. హార్డ్‌రాక్ కేప్, రెడ్ రీనో వంటివి కొలువుదీరాయి. ఇప్పటికే ఐకియా, ఇనార్బిట్ మాల్, శరత్ క్యాపిటల్ మాల్ వంటి అత్యాధునిక షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు ఐటీ కారిడార్‌లో అత్యంత ఆధునిక శైలి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశారు. ఇలా పదుల సంఖ్యలో ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర వాసులకు ఆటవిడుపు కేంద్రాలుగా మారుతున్నాయి.