Model Markets | సిటీబ్యూరో: గ్రేటర్లో మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్ పరం చేసే పనిలో ఉన్నారు. వాస్తవంగా అందుబాటులోకి వచ్చిన చోట స్థానికులకు సూపర్మార్కెట్లలా ఈ మోడల్ మార్కెట్లు ఉపయోగపడాలి. కానీ మోడల్ భవనాలను ఏకంగా సీఎస్ఆర్ కింద ఫౌండేషన్లకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే సీఎస్ఆర్ కింద డాక్టర్ విజయ్‌కుమార్ దాట్ల ఫౌండేషన్, బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు మోడల్ మార్కెట్ భవనాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఏడాది పాటు అప్పగించారు.
స్కిల్లింగ్ అండ్ లివ్లీహుడ్ ప్రోగ్రాం కింద స్లమ్స్‌లోని పేద మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆయా అంశాల్లో తగిన శిక్షణతో నైపుణ్యం కల్పించడంతో పాటు వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా, ఉపాధి పొందేలా సహకరిస్తామని సదరు ఫౌండేషన్ జీహెచ్ఎంసీకి తెలియజేసింది.
తాజాగా ఖైరతాబాద్ జోన్ మెహిదీపట్నం సర్కిల్ మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్‌ను సీఎస్ఆర్ కింద లైట్‌హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ సొంత నిధులతో సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ నిర్వహించుకునేందుకు ఒక సంవత్సర కాలం పాటు మార్కెట్‌ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంవోయూ చేసుకునేందుకు బుధవారం స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 6వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.