భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శత్రు దేశం నుంచి అనుకోని పరిస్థితుల్లో దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ ప్రక్రియ కొనసాగింది. భద్రతా బలగాలు బుధవారం ఈ మాక్ డ్రిల్‌ను ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట చేపట్టాయి. సికింద్రాబాద్, కంచన్‌బాగ్ డీఆర్డీవో లిమిట్స్, గోల్కొండ కంటోన్మెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరిగింది.
మారేడ్‌పల్లి ఏఆర్ మనీ అపార్ట్మెంట్, కంచన్‌బాగ్‌లోని చంపాపేట రోడ్ ట్విన్ టవర్ అపార్ట్మెంట్, మల్లాపూర్‌లోని హైరైజ్డ్, మే ఫ్లవర్ అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ సిబ్బంది, రెవెన్యూ, ఎన్సీసీ, వైద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్, ట్రాన్స్‌పోర్టుతో సహా మొత్తం 12 విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిటీ బ్యూరో/బొల్లారం/సైదాబాద్/మల్లాపూర్, మే 7 (నమస్తే తెలంగాణ):నగరంలోని నాలుగు ప్రాంతాల్లో సాయంత్రం సరిగ్గా 4 గంటలకు 2 నిమిషాల పాటు సైరన్ మొగింది. పోలీసులు మోహరించి మైక్‌లలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇండ్లలోకి, అపార్టుమెంట్లలోకి వెళ్లాలని, బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ ఉండవద్దంటూ అనౌన్స్ చేశారు. వెంటనే వారంతా అపార్టుమెంట్లలోకి, సెల్లార్లోకి వెళ్లిపోయారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాంబులు, కాల్పుల శబ్ధం వినిపించడం.. ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడం.. సమీపంలో ఉన్న అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు మోహరించడం.. ఫైరింజన్లు పొగ వస్తున్న చోటుకు నీళ్లు చిమ్ముతూ మంటలు అర్పివేయడం వంటివి మాక్ డ్రిల్‌లో నిర్వహించారు.
కండ్లకు కట్టినట్లు..
ఫైర్ ఇంజిన్లు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్సీసీ బలగాలు చుట్టుముట్టడం.. మెరుపు వేగంతో అపార్ట్మెంట్లలోని క్షతగాత్రులను బయటకు తీసుకురావడం.. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ల్లోకి వారిని ఎక్కించడం.. పక్కనే అప్పటికే ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి క్షణాల్లో తరలించడం.. మరికొంత మందికి పోర్టబుల్ ఆక్సిజన్ కిట్ అమర్చి వైద్యశిబిరానికి తీసుకురావడం.. బాంబు పేలుడు వల్ల వచ్చిన పొగ వల్ల ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయినవారికి భద్రతా సిబ్బంది సీపీఆర్ చేయడం వంటి ప్రక్రియలను మాక్ డ్రిల్‌లో కండ్లకు కట్టినట్లు నిర్వహించారు.
కాచిగూడ రైల్వే స్టేషన్లో..
కాచీగూడ: కాచిగూడ రైల్వే స్టేషన్లో రైల్వే సివిల్ డిఫెన్స్ కంట్రోలర్ ఉదయ్ నాథ్ కోట్ల పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఫ్లాట్ ఫారమ్-1లో వివిధ విభాగాల సిబ్బంది ప్రయాణికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైల్వే ఎస్పీ చందన దీప్తి, డీఎస్పీ జావెద్, రాజ్‌దురై, కేఎల్ఎన్ స్వామి, స్టేషన్ డైరెక్టర్ కే బాలాజీ, సీఐ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
హయత్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో..
హయత్ నగర్: హయత్‌నగర్ బస్టాండ్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. అధికారులు ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కే జానకి, ఫైర్ స్టేషన్ అధికారి యాదగిరి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు, ఇన్స్పెక్టర్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చందానగర్ పీఎస్ పరిధిలో..
చందానగర్: చందానగర్ పీఎస్ పరిధిలో రక్షణ, పోలీసు అధికారులకు ఏవిధంగా సహకరించాలో సూచించారు. అపర్ణ నియో మాల్, లింగంపల్లి రైల్వేస్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
కూకట్పల్లి పరిధిలో..
కేపీహెచ్‌బీ కాలనీ: యుద్ధం వస్తే ప్రజలంతా సంఘటితంగా ఉండాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ పీఎస్ పరిధిలోని జేఎన్టీయూ చౌరస్తా, మలేషియన్ టౌన్షిప్, రామ్ నరేష్ నగర్ కాలనీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
6 విమానాలు రద్దు
శంషాబాద్‌రూరల్, మే 7 : భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రాయానికి రావాల్సిన ఆరు విమానాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.