బేగంపేట్ జూన్ 11: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఎల్లమ్మ ఆలయ అధికారులు వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి జులై 1 వ తేదీన అమ్మవారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ లేఖను అందజేశారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యేను వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వస్తారని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో ఈ నెల 14 వ తేదీన ఉదయం 10.00 గంటలకు ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో కృష్ణ తదితరులు ఉన్నారు.