హైదరాబాద్ : ఆరు గ్యారెంటీలలో 5 హామీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. శుక్రవారం అమీర్‌పేట(Ameerpet) డివిజన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌తో(Padmarao goud) కలిసి ఇంటింటి ప్రచారం(Election campaigned) నిర్వహించారు. ముందుగా సుప్రభాత్ నగర్లో పార్టీ కార్యాలయాన్ని తలసాని ప్రారంభించారు.
అనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బీజేఆర్ నగర్, రేణుకా నగర్, బల్కంపేట తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏం చేశామో చెప్పి ప్రజలను ఓట్లు అడిగే ధైర్యం తమకు ఉందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అలా చెప్పగలరా ? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చెందాయని వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్‌కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే సికింద్రాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం తధ్యమని అన్నారు.