మహేశ్వరం, డిసెంబర్ 28: దేశంలో ఎక్కడా లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాంక్‌బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని చూసే అవకాశం లేకుండా గేటుకు తాళాలు వేసిందని మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితారెడ్డి విమర్శించారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో సర్పంచ్ క్రిష్ణవేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఏ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదని, అంబేద్కర్ అందరి వాడన్నారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని అన్నారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం దండలు వేసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించిందన్నారు.
సిరిగిపురం అభివృద్ధికి కృషి..
సిరిగిపురం గ్రామంలో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, లా కళాశాలలను ఏర్పాటు చేయిస్తానని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి కేసీఆర్ మెడికల్ కళాశాలను మంజూరు చేయిస్తే రేవంత్ రెడ్డి కొడంగల్‌కు తన్నుకుపోయారన్నారు. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం గురించి అడిగితే రేవంత్‌రెడ్డి బూతులు తిడుతున్నారన్నారు. గ్రామాలలో సర్పంచ్‌లు ఎవరు కూడా అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సర్పంచ్ నవీన్, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, కర్రొల చంద్రయ్య, అంబయ్య, రాజునాయక్, ప్రభాకర్ రెడ్డి, ఆనందం, సమీర్, ప్రభాకర్, అదిల్ తదితరులు ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
బడంగ్పేట్, డిసెంబర్28: బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ బడంగ్పేట్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, గుర్రం ప్రసన్న వెంకట్ రెడ్డి , గీత, కాలనీవాసులు ఉన్నారు. అలాగే అల్మాస్గూడ పరిధిలోని పలు కాలనీలకు చెందిన కాలనీ అసోసియేషన్ నాయకులు బోయపల్లి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కలిసి వినతిపత్రం
అందజేశారు.