బడంగ్‌పేట, మే 19 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్య పునరావృత్తం కాకుండా చూడాలని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథీలానగర్, భవానీ నగర్లో పర్యటించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలాపూర్ చౌరస్తాలో ఓ ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. వర్షాకాలంలో కాలనీలలో వరద నీరు నిల్వకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
ముంపు కాలనీల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. నాలా పనులు పూర్తి చేయకుండా వదిలేసిన వాటిని పూర్తిచేయించాలన్నారు. చెరువు పరిసరాలలో ఉన్న కాలనీలకు వర్షం నీరు రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాలని, వరద కాల్వలకు అడ్డుగా ఉన్న వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ముంపు కాలనీలలో అధికారులు పర్యటించి సమస్యలను తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని, ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, కార్పొరేటర్లు అనిల్‌కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, బడంగ్‌పేట అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహన్, కాలనీ వాసులు వెంకటేశ్వర్లు, ఫిరాజ్, విజయసింహా రెడ్డి, పూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.