BRS | బడంగ్పేట్, జూలై 21 : మహేశ్వరం నియోజకవర్గం పరిధి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికార పక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గి మరోమారు మీర్పేట గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని నిరూపించిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాసంలో గెలిచి పార్టీ పేరును ఉన్నత స్థానంలో నిలిపిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను, నాయకులను శాలువాతో సన్మానించారు. ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.