మైలార్‌దేవ్‌పల్లి : ప్రజా అవసరాలను తీర్చేందుకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ వట్టెపల్లి ప్రాంతంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో 71 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు.
పనుల పురోగతిని, నాణ్యతను స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సీసీ రోడ్డు, రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రీపురం, వట్టెపల్లి వెళ్లే ప్రజలకు ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుందన్నారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం అన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రజలకు సులువైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిచడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీఠ వేస్తుందని చెప్పారు. పనులను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్, డీఈ కార్తీక్, రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, ఈఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.