మణికొండ, ఆగస్టు 28 : స్పోర్ట్స్ పార్కులతో మానసికోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్కును శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మణికొండ మున్సిపాలిటీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించుకున్న అల్కాపూర్ టౌన్షిప్ వాసులు తమ సొంత నిధులతో స్వచ్ఛందంగా స్పోర్ట్స్ పార్కును ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. కలిసికట్టుగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకునేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు పనిచేయాలన్నారు. ప్రతి కాలనీకో స్పోర్ట్స్ పార్కును ఏర్పాటు చేసుకునేందుకు సంక్షేమ సంఘాలు కృషి చేయాలన్నారు. స్పోర్ట్స్ పార్కులతో మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం దక్కుతుందన్నారు. పార్కులో సైకిల్ ట్రాక్, బాస్కెట్ బాల్, క్రికెట్ నెట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, నాయకులు బషీర్, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి,ఆగస్టు 28: ప్రభుత్వం అన్ని వర్గాల కు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అ న్నారు. శనివారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ సంఘం సభ్యులు ఐక్యతతో ఉన్నందున సంఘం భవనానికి స్థలం ఇప్పించానని తెలిపారు. 300 గజాల స్థలం కావాలని అడిగినప్పుడు 500 గజాల స్థలం ఇచ్చారని, భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి రూ.30లక్షల నిధులను మంజూరు చేశామని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంఘాలకు భవనానికి స్థలాన్ని ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైకోల్ మహేందర్ యాదవ్, సంఘం అధ్యక్షుడు అక్కెం కృష్ణయాదవ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్, శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, అక్కెం నర్సింగ్ యాదవ్, మ్యాకం వెంకటేశ్ యాదవ్, రాముయాదవ్, యాదగిరి, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.